Wednesday, 26 June 2013

కవితాంజలి


హిమాద్రి నుంచి మహాబ్ధి దాకా                                       
వ(బ)నాల  మొదలు ఎడారి వరకు
  
గగనం భువనం  సంద్రం 
చోటేదైనా నీకు నివాసం


పదాతిదళము నౌకాబలము వాయుసైన్యం
తీరేదైనా అద్వితీయం నీ శౌర్యం

పగలు సూర్యుడే నీకు నేస్తం రాతిరి చంద్రునితో సహవాసం
ఏదీ నిద్రకు ఆహ్వానం అసలెదీ విశ్రాంతికైన సమయం

అనిమీల నేత్రం అలుపు లేని కాయం
అందరికీ అసాధ్యం ఈ అకుంఠిత సంకల్పం

జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ అని వాల్మీకి వాక్యం
జన్మభూమి తల్లిని గన్న తల్లని చాటుతోంది నీ సైనిక తత్త్వం

కుటుంబానికి నువ్వు దూరం సుఖాలన్నీ నీకు తృణప్రాయం
ఈ దేశమంతా నీకు పరివారం భుజ స్కందములపై దేశ రక్షణ భారం

ఇంతలో ..............

ప్రకృతి తల్లి ఆగ్రహ జ్వాలల విలయ తాండవం
భూమ్యాకాశ సాగరాలలో ప్రళయాట్టహాసం

భీతిల్లిన జనుల ఆక్రందనాదం
మనుగడ అవుతోంది అయోమయం అగమ్యగోచరం

అంతలోనే అందింది నీ ఆపన్న హస్తం
గాఢాంధకారంలో అది మాకు కాంతి కిరణం

ప్రాణాలొడ్డి నువ్వు చేస్తున్నావు శిఖరారోహణం విమానవిన్యాసం జలాంతర్యానం 
నీ ధైర్య సాహసాల భిక్షే మా ఈ ప్రాణం

నీ రక్తార్పణతో సంప్రోక్షిస్తున్నావు నలు చెరుగులా క్షేమ జలం
ఏమిచ్చి తీర్చుకోగలము నీ ఋణం

నీ త్యాగాన్ని నిర్లజ్జగా రాజకీయం చేస్తున్నది ఈ దేశ నాయకగణం
అట్టి పాలకుల ఏలికలో ఉన్నందుకు సిగ్గుతో తల దించుకుంటున్నాం మేం

అయినప్పటికీ ఎప్పటికీ
 
అతుల్యం నీ స్థైర్యం అమూల్యం నీ త్యాగం
నిను కన్న వారికి బాధాతప్త హృదయంతో చేస్తున్నాము కృతజ్ఞతాభివందనం

నీ సాహసస్ఫూర్తి అజరామరం నీ త్యాగకీర్తి ఆచంద్రతారార్కం
భరత జాతి చేస్తోంది నీకు హృదయైక అశ్రువందనం

ఓ భరత మాత ముద్దు బిడ్డా ! సకల జన ఆత్మ బంధువా! 
అంజలి ఘటిస్తూ సమర్పిస్తున్నాము ఈ కవితా పుష్పగుచ్ఛం !

This is a poetic prose written by me in Telugu thanking Indian soldiers helping Uttrakhand flood victims. English version of the same will be posted soon.
-- Srinath

Indian Army is executing ‘Operation  SURYA HOPE’ with the aim of providing succor, hope, humanitarian assistance and logistic needs in Badrinath, Hemkund and Kedarnath regions. Please check http://suryahopes.in/ for more details.

No comments: