Thursday, 9 September 2021

బ్రహ్మాస్త్రం

 

ఏదీ నిన్న చూసిన వసంతం

ఏదీ మొన్న అనుభవించిన రజనీ గంధం

ఎక్కడ చిన్నారుల ఆ నవ్వులు హేలలు

ఎక్కడ పసిపిల్లల ఆటలు పాటలు

ఏమయ్యాయి మనుషులు ఒక్కటిగా జరుపుకున్న సంబరాలు

ఎటు వెళ్లాయి అందరం ఏకమై పంచుకున్న సంతోషాలు

------------------------------------------

క్రూర కరాళ కరోనా తెచ్చిన వైపరీత్యం

సుందర జగత్తుతో మహమ్మారి ఆడిన వికృత కలాపం

మనిషి మనిషికీ పెరిగెను దూరం

ముఖానికి వేసిన అడ్డు తెరలు మనసుకు తెచ్చెను భారం

ఎందరి జీవితాలు దుఃఖాంతం

మరెందరి ప్రాణాలు బలిదానం

ఎన్ని ఊపిరులు ఆగాయి

ఎందరి ఉపాధులు కూలాయి

ప్రాణాలా గాలిలో పెట్టిన దీపాలా

ఆకలి మంటలా అవి రగిలే కాష్ఠాలా

ముగింపు లేదా ఈ విలయ తాండవానికి

ఆదే తప్ప అంతం లేదా ఈ ఉగ్ర నర్తనానికి

ఇంతేనా ఇక ఇంతేనా?

అంతేనా ఇది మన అంతేనా?

------------------------------------

నైరాశ్యపు నిశీధిలో దారి తప్పిన ఓ మానవా !

అల్లదుగో అవుతోంది వైద్య శాస్త్ర సాంకేతిక ఉషోదయం

వెలుతురు చీల్చుకుంటూ పుడుతోంది టీకా ఆయుధం

క్రూర కరోనా క్రిమిని సంహరించే దివ్యాస్త్రం

భళా ! అది చాలా ? మైమరచి సంబరాలు జరుపుకుందామా?

---------------------

పిచ్చి మానవా !

స్త్రాలు మాత్రం శత్రువును సంహరిస్తాయా?

శస్త్రాలు తోడుంటే సమరాలను జయిస్తామా?

బుధ్ధి బలం వెన్నంటని శస్త్రం వ్యర్థం

క్రమశిక్షణతో చెయ్యలేని యుద్ధానికి లేదు అర్థం

ఈ పాడు క్రిమిని పారద్రోలే వరకు సంబరాలు కట్టిపెట్టు

ఆటపాటలు అటకెక్కించు !

----------------------------------

మానవాళి ఆరోగ్యానికి అహర్నిశము శ్రమిస్తున్నారు వైద్యులు

మనందరి శ్రేయస్సుకి చెమటోడుస్తున్నారు శ్రామిక,కార్మిక,కర్షక,రక్షకులు

అతుల్యం వారి కష్టం మహోన్నతం వారి త్యాగం

వృథా కారాదు వారి స్వేద ఇంధనం

-------------------------------

జోడించు వారి శ్రమకి నీ బాధ్యతను

వినియోగించు నీకున్న బుద్ధిని

భుజాన ధరించు టీకా ఆయుధాన్ని

కప్పుకో ముఖాన్ని పాటించు దూరాన్ని శ్వాసించు శుభ్రతను

సహనం స్థైర్యం సంకల్పం శాంతం

కావాలి మనందరి మంత్రం

ఎంతటి రక్కసినైనా తుద ముట్టించేందుకు

అదే బ్రహ్మాస్త్రం !

1 comment: