పొద్దుగాలే
దొర బంగళాల పనికొచ్చిండు యాకయ్య. ఆ బంగళాల పనికి చేరి మూడు దిన్మలాయె. ముంగటి రాత్రి
దావత్ లెక్కల తాగిడిసిన మందు సీసాలు, గలాసులు ఇంకా ప్లేట్లు కన్పించినై.
టీవీ అట్లనె
నడుస్తుండె. అందుల దొర బొమ్మ కన్పడతుంది. పేపరోండ్లకు చెప్తుండు దొర " మా చరిత్రల
ఇసంటి దినం మళ్ళా రాదు. జాగీర్దార్ల,జమీందార్ల రాజ్యం ఇయ్యాల్టి సంది బంద్. మా పోరాటాల
విజయం వెన్కపడ్డ ప్రజలది. ముంగట రోజుల్ల ఆ తమ్ముండ్ల, చెల్లెమ్మల చేతిల సర్కారు నడవాలె."
దిల్ ఏక్దం
ఖుషాయె యాకయ్యకు. "నిజమే గదా ! మొన్న దొర చెప్పినట్టు యేడ్నించో ఈడకొచ్చి మా మాటను,
పాటను తమాషా చేస్తరు. మంచిగున్నవా అంటే అదేమ్ తెల్గు బాగున్నవా అనాలె అంటరు. ఓటల్లు,
సైన్మాలు, స్వీట్లు అన్నిట్ల వాళ్ళే. కరీంనగర్, వరంగల్, నిజాంబాద్ యేడ నీళ్ళుంటే ఆడ్కి
పోవుడు. జమీన్ వాళ్ళది. కూలీ మాది. ఇసుంటి అన్యాయం బంద్ చేయిస్తున్న ఈ దొర కాడ పని
చేసుడు నా పున్నెం" అని అన్కొనె మనసుల.
అంతల
"ఒరే యాకయ్యా ! ఏడున్నావురా యాకిగా?" అని దొర మన్మడి గొంతుక విన్పడి ఉరుక్కుంటు
పాయె. "ఏం పెట్టుకున్నవుర చెవుల్ల ఎన్ని సార్లు పిలవాలె . కాఫీ తే పో"
అని కసిరె చిన్న దొర. ఈ ఇంట్ల ఆడోల్లు పని చెయ్యరు. ఇంక ఈ పొద్దు వంట చేసే లక్ష్మక్క
వచ్చే ఇషార కన్పిస్తలేదని యాకయ్య కాఫీ పెట్టనీకి కిచెన్ రూమ్ కి పాయె.
కిచెన్ల
కాఫీ చేస్తున్న యాకయ్యకు హాల్ల దొర మాట విన్పడె. దొర సెక్రెట్రి " సార్ ! ఇంకో
హాఫ్ యాన్ హౌర్ లో ప్రెస్ కాన్ఫెరెన్స్ ఉంది. నేషనల్ మీడియా నుంచి వస్తున్నరు."
అని దొరతో చెప్పి, "యాకిగా ఈ హాల్ల క్లీన్ చెయ్య్" అని కిచెన్ల పాకెట్ల ఉన్న
సక్కెర డబ్బాల పోస్తున్న యాకయ్యను పిల్చె.
"అన్నా
! ఈ నా కొ___ల మాట చూడే. రేపు ఢిల్లి హైకమాండ్ పైసలిస్తే మనం ఉద్యమం ఇడిసిపెడ్తమని
స్టేట్మ్ంట్ ఇస్తున్నరు పబ్లిక్ల. ఎన్కమాల ఢిల్లి సంది రాయబారాలు చేసుడు. ముంగట నుంచి
మనల్ని బద్నాం చేసుడు" అని దొర తమ్ముడు అరిచె. "అరే చిన్నా ! రాజకీయాల్ల
ఇసుంటివి కామన్ అని నీకు తెల్వదా? జర కుషొ. అట్ల చూడు టీవీల మన బొమ్మ. ఎవురెంత ఏడ్సిన
పబ్లిక్ మన ఇజ్జత్ డౌన్ అవ్వనీకె అవకాశం లే. నువ్వు బేఫికర్గా కాఫీ తాగు. యాకిగా ! ఏడరా కాఫీ ? " అనె కోపంగా దొర.
"దొరా!
నీ బాంచెన్. ఈ లక్ష్మక్క అన్నీ ఏడ పెట్టినదొ సమజైతలే. గిప్పుడె తీస్కొస్త" అని
చెప్పి కిచెన్లకి ఉరికె యాకయ్య. దొర సెక్రెట్రీ " సార్ ! మీడియా వాళ్ళు ఇంకో ఇరవై
నిమిషాల్ల వస్తున్రు. క్లీనింగ్ చెయ్య్ యాకిగా" అని పిల్చె.
టెన్షన్ల
యాకయ్య " వస్తున్న అయ్యా వస్తున్న! జర రెండు నిమ్షాలు." అన్న మాట విని దొర
తమ్ముడు అరిచె " ఏంరా ? కసురుకుంటున్నవ్. " అన్న మాట దొర విని " యాకిగ
ఏంరా ఒల్లు దిమాఖ్ ఎట్లుంది? బయటకు
రా ?" అని పిల్చె.
బయటకొచ్చిన
యాకయ్య " నేనేడ కసిరినా దొర" అని మాట కతం చేసె టైమ్ల దొర నారాజ్గ లేచి
"మంచిగా పని చేసుడు లేదు. మళ్ళా ఎదురు మాట్లాడుడు వేరే." అని
యాకయ్య చెంప పగ్లగొట్టె. యాకయ్య దొర కాళ్ళ మీద పడి " దొరా ! నీ బాంచెన్ కాల్మొక్త.
అన్నం పెట్టేటోళ్ళు మీరు. మీకు నేను ఎదురు మాటాడుడా." అప్పుడు దొర "ఇగో,
మళ్ళీ ఇంకొక్క మాట బైట్కొస్తే నాల్క కోస్తా" అని కాలిత తన్నె. అప్పుడే వచ్చిన
దొర మన్మడు " తాతా ! నిన్న నువ్వు టీవీ ఇంటర్వ్యుల వెన్కపడ్డ ప్రజల చేతికి సర్కారు
ఇస్తనని చెప్పినవు కదా! మన యాకి గానికి గంద్కే ఎదురు చెప్పనీకి ధైర్యమొచ్చనేమో"
అని వికృతంగా నవ్వుతూ వచ్చి " ఏమ్రా ! సర్కారు గావాల్నా? ఏమవుతావ్రా? సీఎంవా?
పీఎంవా?" అని మల్లా కాల్త తన్నె.
దొర సెక్రెట్రీ
" వానితో ఏం గానీ సార్. మీడియా వాళ్ళు వచ్చే టైమాయె. మీరు జర రెడీ అవున్రీ. ఒరే,
యాకీ ! పాంచ్ మినిట్ల ఇది క్లీన్ చేసి అప్పుడు కాఫీ చెయ్ పో" అని అర్చె.
పావు గంట
తర్వాత వచ్చిన మీడియా వాళ్ళతో దొర "మా చరిత్రల ఇసంటి దినం మళ్ళా రాదు. జాగీర్దార్ల,జమీందార్ల
రాజ్యం ఇయ్యాల్టి సంది బంద్. మా పోరాటాల విజయం వెన్కపడ్డ ప్రజలది. ముంగట రోజుల్ల ఆ
తమ్ముండ్ల, చెల్లెమ్మల చేతిల సర్కారు నడవాలె."
ఇంట్ల పని
చేస్తున్న యాకయ్యకు కండ్లు తిరుగుతున్నయి చెవిలో " పోరాటాల విజయం వెన్కపడ్డ ప్రజలది
! పోరాటాల విజయం వెన్కపడ్డ ప్రజలది !" రింగుమంటున్నయి.
-------------------------------------------------------------------------------------------
టీ తాగుతూ
పేపర్ చదువుతున్నాడు శంకర్. రాష్ట్ర విభజన వార్తలు చదువుతుంటే రక్తం మరిగిపోతున్నాది.
"నిజమే, మనది ఆ ఊరు కాదు. ఇన్ని సంవత్సరాలుగా అందరూ కష్టపడి డెవెలప్ చేస్కొన్న
సిటీని ఇప్పుడు ఒక ప్రాంతం వాళ్ళకు ధారపోయటం ఏం న్యాయం? కానీ రేపు రాష్ట్రం విడిపోతే
మీలాంటి యువకుల ఉద్యోగాలకు ఎంత దెబ్బ. కదలండి తమ్ముళ్ళారా ! మన తుది రక్తపు బిందువు
చిందించైనా, ప్రాణార్పణలు చేసైనా సమైక్య రాష్ట్రాన్ని కాపాడుదాం" అని రెడ్డి నాయుడు
గారు నిన్న మీటింగులో చెప్పిన మాటలు చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి.
అప్పుడే
టీవీలో "ఆ నగరాన్ని అభివృధ్ధి చేసింది మేము డబ్బుతో కాదండీ. మా కష్టంతో, చెమటతో,
రక్తంతో. ఈ రోజు మా ఇంట్లోచి మమ్మల్ని వెళ్ళగొడుతున్నారండీ. ఈ అన్యాయాన్ని ఆపేవాళ్ళు
లేరా అని కన్నీళ్ళతో అడుగుతున్నాము." అన్న రెడ్డి నాయుడు గారి ప్రసంగం విని కుర్చీలో
కళ్ళు మూసుకొని పడుకున్నాడు శంకర్.
అంతలో అతని
నాన్న " ఒరే ! అది రాజకీయం. ఇక్కడి నుంచి వెళ్ళిన రెండు, మూడు జిల్లాల వాళ్ళు,
కులాల వాళ్ళూ అక్కడ సంస్కృతిని తక్కువ చేసారు. అక్కడ మనుషుల మీద పెత్తనం చేసారు. శాసించే
స్థాయికి ఎదిగారు. దాన్ని అక్కడ నాయకులు వాడుకున్నారు. అందరు జనంతో ఆడుకున్నారు. రెండు
ప్రాంతాల వాళ్ళు తప్పులు చేస్తూనే ఉన్నారు కాబట్టి పరిస్థితి చెయ్యి దాటిపోయిందిరా.
నీకవన్నీ వద్దు. వదిలెయ్" అన్నారు.
దానికి శంకర్
" రేపు అక్కడ ఉన్న మనవాళ్ళు పరాయివాళ్ళలా భయపడుతూ బతకాలి రాష్ట్రం విడిపోతే"
అన్నాడు. " పిచ్చిగా మాట్లాడకు. మీ బాబాయి పాతిక సంవత్సరాలుగా బెంగుళూరులో ఉన్నాడు.
మీ అక్క, బావ అమెరికాలో ఇల్లు కూడా కొనుక్కున్నారు. ప్రపంచంలో ఎవరు ఎక్కడైనా ఉండొచ్చు.
ఆపే చట్టాలు ఏవీ లేవు." అని తండ్రి సమాధానం విని శంకర్ " నాన్నా ! మీలాంటి
వాళ్ళు సర్దుకుపోబట్టే ఇలా జరిగింది. మేము వదలం. చూస్తూ ఉండండి. రెడ్డి నాయుడు గారి
నాయకత్వంలో ఈ రోజు మహాగర్జన సభతో మా సత్తా చూపిస్తాం" అని కోపంగా లోపలికి వెళ్ళాడు.
తర్వాత స్నానం చేసి తయారై బయటకు వెళ్తున్న కొడుకు ఆవేశాన్ని నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయాడు
శంకర్ తండ్రి.
"ఎక్కడికెళ్తున్నావు
తల్లీ? ఈ రోజు కాలేజీ బంద్ కదా" అని అదిగాడు రెడ్డి నాయుడు కూతుర్ని. "నాన్నా
! ఈ రోజు మా కాలేజ్ స్టూడెంట్సుది మానవహారం ప్రోగ్రాం ఉంది. నేనూ దాంట్లో ఉంటే మీరు
ఉన్నట్టుగా ఉంటుందని అందరు అడిగారు. అందుకే నా ఫ్రెండు ఇంటికెళ్ళి అందరితో కలిసి వెళ్దామని
బయల్దేరాను." ఏదో మాట్లాడబోయిన పీఏని ఆపి, రెడ్డి నాయుడు " అరెరె, అవునా
! మన వంటమనిషి కూతురికి ఏడో క్లాసు పరీక్షలట. నిన్ను కాస్త లెక్కలు చెప్పమని అడిగిందట
ఆమె. వెళ్ళి మీ అమ్మను అడుగు. ఆ మానవహారానికి కూడా నేను వెళ్తాలే. నువ్వు లోపలకెళ్ళమ్మా"
అని కూతుర్ని లోపలికి పంపాడు.
పీఏ వైపు
తిరిగి నవ్వుతూ "నా కూతురు మన టైపు కాదులేవయ్యా. పుస్తకాల చదివి ఏదో మాట్లాడుతూ
ఉంటుంది. మన లీడర్లని తొందరగా రమ్మను. మాట్లాడాలి. స్టూడెంట్సుని మాత్రం ఈ మీటింగు
అయ్యాక మళ్ళీ పిలువు." అని చెప్పాడు.
అరగంట తర్వాత
రెడ్డి నాయుడు ఛాంబర్లో అందరితో " చూడండీ ! రాష్ట్రం విడిపోక తప్పదు. కామన్ రాజధాని
ఇస్తారని న్యూసు ఖచ్చితంగా తెలిసింది. మన ఏరియాలో పొజిషను చూసి పెద్ద మెట్రో నగరం అనౌన్సు
చేస్తారని అంటున్నారు. అదిగాని జరిగితే విడిపోవడమే మనకు మంచిది. రియల్ ఎస్టేటు రేట్సు
విపరీతంగా పెరుగుద్ది కదా. " అందరూ సంతోషంగా చప్పట్లు కొట్టారు.
"మరి
ఈ రోజు మహాగర్జన సభ" అని అడిగాడు ఒక నాయకుడు. " నడవనీండయ్యా ! నడిచి ఎంత
హింస జరిగితే అంత త్వరగా మన ఏరియాను మెట్రో చేస్తారు. మనకు లాభం " అని పీఏతో
"ఎవయ్యా ! ఆ స్టూడెంటు లీడరు శంకర్ని పిలిచి ఈ రోజు సభ అయ్యాక బస్సు రోకో, రైలు
రోకో గట్టిగా చెయ్యించమను. పోలీసులు ఆపినా ఆగొద్దను. ఈ మెట్రో విషయం మాత్రం ఈ రూం దాటి
పోకూడదు. స్టూడెంట్సుకి అస్సలు తెలియకూడదు" అని మీటింగు ముగించాడు.
మహాగర్జన
తర్వాత విద్యార్థుల హింస. పోలీసు కాల్పుల్లో ఇద్దరు చనిపోయారు. పది మందికి గాయాలు అనెఏ
వార్త టీవీ లొ చూసి శంకర్ సెల్ ఫోన్ కి ప్రయత్నించీ ప్రయత్నించీ అలిసిపొయ్యాడు అతని
తండ్రి. ఇక సాయంత్రం ఏడుస్తున్న భార్యను బాధగా చూసి బజారులోకి వచ్చి నడవటం మొదలుపెట్టాడు.
సందు చివర్న కనపడ్డ ఆటో యూనియన్ లీడరు సుబ్బా రావు ఆయన మొహంలొ బాధ అర్థం చేసుకొని
" సార్ ! దెబ్బలు తగిలిన స్టూడెంట్సుని జనరల్ ఆస్పత్రిలో చేర్చారట. రండి వెళ్దాము.
" అని ఆటోలో ఎక్కించుకొని హాస్పిటలుకి పిల్చుకెళ్ళాడు.
పదిహేను
రోజులు ప్రాణాలతో పోరాడి ఆస్పత్రి డిస్ఛర్జి అయ్యాడు శంకర్. తండ్రితో కలిసి సుబ్బా
రావు ఆటోలో ఇంటికొచ్చి కనీళ్ళు పెట్టుకున్న తల్లిని నవ్వుతూ చూసాడు. కుర్చీలో కూచొని
తల్లి తెచ్చిన టీ తాగుతూ న్యూస్ పేపర్లో " రాష్ట్ర విభజనతో మన ప్రాంతానికి మహర్దశ"
అన్న రెడ్డి నాయుడు ప్రకటన చూసి పక్కనే కూచున్న తండ్రి కళ్ళలోకి చూడలేకపొయాడు. సిగ్గుతో
తలదించుకున్నాడు.
-------------------------------------------------------------------------------------
కడప రేడియో
స్టేషను " తెలుగు జాతి మనదీ నిండుగా వెలుగు జాతి మనదీ" అని పాడుతున్నాది.
విజయవాడ
రేడియో " మా తెలుగు తల్లికీ మల్లె పూదండ" అని నినదిస్తున్నాది.
హైదరాబాదు
రేడియోలో శ్రీశ్రీ కవితా గోష్ఠి " ఏ చరిత్ర చూసినా ఏమున్నది గర్వ కారణం ? నరజాతి
చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం .."
No comments:
Post a Comment